21.9.2025
సాహితీ కృషీవలుడు ‘లోకనాథం’
– ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి
పాలకమండలి సభ్యులు, యోగి వేమన విశ్వవిద్యాలయం
ప్రముఖ పద్యకవులలో ఒకరై తనదైన మార్గలో కవితా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ 34 రచనలు చేసిన సాహితీ కృషీవలుడు ఎం.వి.లోకనాథం అని యోగి వేమన విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి అన్నారు. యోగి వేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం నిర్వహిస్తున్న ‘నెలనెలా సీమ సాహిత్యం’ 147వ సదస్సులో భాగంగా ‘ఎం.వి.లోకనాథం జీవితం – సాహిత్యం’ కార్యక్రమం ఆదివారం బ్రౌన్‌శాస్త్రి సమావేశ మందిరంలో నిర్వహింపబడింది.
సభాధ్యక్షులు, సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం పరిశోధన కేంద్రం సంచాలకులు ఆచార్య జి.పార్వతి మాట్లాడుతూ నెలనెలా సీమ సాహిత్యం కార్యక్రమం ద్వారా ప్రసిద్ధులై అందరికీ పరిచితులైన సాహితీవేత్తలే కాక మరుగునపడిన ఎంతోమంది సాహితీవేత్తలు కూడా సాహితీ ప్రేమికులకు పరిచయం అవుతుండడం సంతోషకరమన్నారు. ప్రధాన ప్రసంగం చేసిన ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి తన ప్రసంగంలో ఎం.వి.లోకనాథం కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలోని కొండమాచుపల్లెకు చెందిన మామిళ్ళ వెంకటరంగయ్య గారి మహాలక్షుమ్మ, రంగయ్య దంపతులకు జన్మించారన్నారు. ఆయన డైట్ కళాశాల ఉపన్యాసకులుగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి జిల్లా పర్యవేక్షణాధికారి, అనియతవిద్య సమన్వయకర్త, జిల్లా విద్యాశాఖాధికారి, జిల్లా పరిషత్ అధికారి మొదలైన పదవులు నిర్వహించి డైట్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పదవీ విరమణ చేశారన్నారు. ఆ తర్వాత అజిమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌లో (బెంగళూరు) స్పెషలిష్ట్‌గా, నెక్స్ట్ ఎడ్యుకేషన్ (హైదరాబాద్) కన్సల్టెంట్‌గా, ఎడిటోరియల్ బోర్డు మెంబర్‌గా సేవలందించారన్నారు.
లోకనాథం శతక రచనలో మేటి అని, ఒక పద్యంలో మరో పద్యాన్ని గానీ, పలు పద్యాలను గానీ ఉంచి రచించే గర్భకవిత్వంలోనూ; పద్మం, ఖడ్గం మొదలైన ఆకారాల్లో పద్యాల్లోని అక్షరాలను ఒక క్రమంలో అమర్చి చెప్పే బంధకవిత్వంలోనూ దిట్ట అని అభివర్ణించారు. లోకనాథం అనేక రచనలు చేశారని, వాటిలో శ్రీలోకనాథ రామాయణం (కావ్యం), శ్రీమలయాళ సద్గురు ఉపదేశ అష్టోత్తర శతి, శ్రీఒంటిమిట్ట కోదండ రామస్వామి చరిత్ర, శ్రీకోదండరామ, శ్రీరామచంద్ర, శ్రీమొల్లమాంబ, దేవీత్రయ, లోకహిత శతకాలు, శ్రీశివ శతకద్వయం, ఒక పద్యంలో రెండు, మూడు, ఆరు పద్యాలు వచ్చేలా గర్భకవిత్వంలో రాసిన రామయ మరియు సాంబయా శతకాలు, చతుర్విధ కందాలతో కూడిన శతకం (ఒక కందంలో నాలుగు కందాలు) ముద్రితాలని, మరో 25 పుస్తకాలు ముద్రణకు సిద్ధంగా
ఉన్నాయన్నారు. లోకనాథం ముద్రిత రచనలను సభకు పరిచయం చేశారు. లోకనాథ రామాయణాన్ని, పలువిధాలైన శతకాలను విశ్లేషిస్తూ లోకనాథం పద్యవిద్యా పాటవాన్ని తెలియజేస్తూ అనేక పద్యాలను ఉదాహరించారు.
కార్యక్రమాన్ని డా॥ భూతపురి గోపాలకృష్ణశాస్త్రి, డా॥ చింతకుంట శివారెడ్డి సమన్వయం చేశారు.
కార్యక్రమ ప్రారంభంలో వక్త ఆచార్య మూల మల్లికార్జున రెడ్డిని సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సంచాలకులు ఆచార్య జి.పార్వతి, సహాయ పరిశోధకులు డా॥ భూతపురి గోపాలకృష్ణశాస్త్రి, డా॥ చింతకుంట శివారెడ్డి, గ్రంథాలయ సహాయకులు జి.హరిభూషణరావు, జూనియర్ అసిస్టెంట్లు ఆర్.వెంకటరమణ, ఎం.మౌనిక, సిబ్బంది కలసి శాలువతో సత్కరించారు.
కార్యక్రమంలో ఎం.వి.లోకనాథం, సోమకళానాథ రెడ్డి, నాగముని, డా॥ వెల్లాల వేంకటేశ్వరాచారి, రాజారెడ్డి, డా॥ జి.వి.సాయిప్రసాద్, కొత్తపల్లి రామాంజనేయులు, కొండూరు జనార్దన రాజు, గొరిగె వెంకటేశ్వర్లు, శ్యామసుందర్ రెడ్డి, బాలరాజేశ్వర రెడ్డి, భాస్కర్ వర్మ, పార్వతి, చంద్రావతి, లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.
డా.పి.సరిత
సంచాలకులు, ప్రజా సంబంధాల విభాగం
యోగి వేమన విశ్వవిద్యాలయం