14.09.2025
తొలి తెలుగు రాజకీయ ఖైదీ ‘గాడిచర్ల’
– డా.భూతపురి గోపాలకృష్ణ శాస్త్రి                                                                                       సహాయ పరిశోధకులు, సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం

గాడిచర్ల హరిసర్వోత్తమరావు సంపాదకీయాలు స్వాతంత్య్రోద్యమ కాలంలో ఆంగ్ల ప్రభుత్వానికి చెంపపెట్టులా ఉండేవని, అందువల్లనే ఆయన తన సంపాదకీయంలో ప్రభుత్వాన్ని పరుషంగా నిందించారనే నెపంతో జైలుకు పంపించారని, అలా తెలుగునేలలో ఆయనే తొలి తెలుగు రాజకీయ ఖైదీ అయ్యారని సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం సహాయ పరిశోధకులు డా.భూతపురి గోపాలకృష్ణ శాస్త్రి పేర్కొన్నారు. యోగి వేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం ఆదివారం ప్రసిద్ధ స్వాతంత్య్ర సమరయోధులు, పత్రికా సంపాదకులు, గ్రంథాలయ ఉద్యమనాయకులు గాడిచర్ల హరిసర్వోత్తమరావు 142వ జయంతిని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పరిశోధన కేంద్రం సిబ్బంది, పాఠకులు కలసి ముందుగా గాడిచర్ల హరిసర్వోత్తమరావు చిత్రపటానికి పూలమాల సమర్పించి నివాళులర్పించారు. ఆ తర్వాత డా.భూతపురి గోపాలకృష్ణ శాస్త్రి మాట్లాడుతూ గాడిచర్ల 1907లో స్వాతంత్య్రోద్యమంలో ప్రవేశించారని, రాజమండ్రిలో ఉపాధ్యాయ శిక్షణ పొందుతూ బిపిన్‌చంద్రపాల్‌ ఉపన్యాసాలతో ఉత్తేజితులై వందేమాతరం ఉద్యమానికి నాయకత్వం వహించారన్నారు. అందువల్ల ఆయనను బ్రిటీష్‌ ప్రభుత్వం కళాశాల నుండి బహిష్కరించడమే కాక ఆయనకు ఎక్కడా ఉద్యోగం ఇవ్వరాదని ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. స్వాతంత్య్రోద్యమంలో బాలగంగాధర తిలక్‌లా ఆయన ప్రదర్శించిన ధైర్యసాహసాలను మెచ్చి ప్రజలు ఆయనను ‘ఆంధ్ర తిలక్‌’ అని పిలిచారన్నారు. 1928లో నంద్యాలలో జరిగిన ఆంధ్రమహాసభలో చిలుకూరి నారాయణరావు దత్తమండలాలకు ‘రాయలసీమ’ అనే పేరును సూచించగా, గాడిచర్ల వారు ఆ ప్రతిపాదనను బలపరచారన్నారు. మహిళల సమస్యల పరిష్కారం కోసం ఆయన ‘సౌందర్యవల్లి’ అనే పత్రిక నడిపారన్నారు. మరో సహాయ పరిశోధకులు డా॥ చింతకుంట శివారెడ్డి మాట్లాడుతూ స్వాతంత్య్రోద్యమం ముమ్మరంగా సాగుతున్న కాలంలో గాడిచర్ల హరిసర్వోత్తమరావు గ్రంథాలయ ఉద్యమం ద్వారా, తన సంపాదకీయాల ద్వారా ప్రజల్లో స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిని నింపారన్నారు. కడపజిల్లా పర్యటనలో గాంధీజీ ప్రసంగాలను గాడిచర్లయే అనువదించారన్నారు. గాడిచర్ల పత్రికారంగంలోకి అడుగుపెట్టి ‘స్వరాజ్య’ అనే తెలుగు పత్రికను ప్రారంభించి ఆంగ్ల ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారన్నారు. సంపాదకుడుగా ఆయన ఎన్నో కొత్త పదాలు పుట్టించారని, ‘ఎడిటర్‌’ అనే పదానికి ‘సంపాదకులు’ అనే పేరు పెట్టింది ఆయనే అని అన్నారు. ఆయన ది నేషనలిస్ట్‌, మాతృసేవ, ఎడల్ట్‌ ఎడ్యుకేషన్‌ రివ్యూ, కౌముది, ఆంధ్రవార్త లాంటి పత్రికలకు కూడా సంపాదకత్వం వహించారన్నారు. రచయిత కొత్తపల్లి రామాంజనేయులు మాట్లాడుతూ స్వాతంత్య్రోద్యమ సమయంలో గాడిచర్ల జైలులో చాలా దుర్భర జీవితాన్ని అనుభవించారన్నారు. కాళోజీ గాడిచర్లను కీర్తిస్తూ చెప్పిన కవితను వినిపించారు.
ఈ కార్యక్రమంలో సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం జూనియర్‌ అసిస్టెంట్లు ఆర్‌.వెంకటరమణ, ఎం.మౌనిక, సిబ్బంది, పాఠకులు చంద్రశేఖర్‌, రంగా, వెంకట నగేశ్‌ పాల్గొన్నారు.

డా.పి.సరిత
సంచాలకులు, ప్రజా సంబంధాలు
యోగి వేమన విశ్వవిద్యాలయం, కడప