21.09.2025
దార్శనికుడైన రచయిత ‘గురజాడ’
– ఆచార్య జి.పార్వతి                                                             సంచాలకులు, సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం

ఆధునిక మహిళ చరిత్రను తిరగరాస్తుందని 19వ శతాబ్దం చివరలోనే గుర్తించిన దార్శనికుడైన రచయిత గురజాడ అప్పారావు అని సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం సంచాలకులు ఆచార్య జి.పార్వతి పేర్కొన్నారు. యోగి వేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం ఆదివారం ప్రసిద్ధ అభ్యుదయ కవి, రచయిత, సంఘసంస్కర్త గురజాడ అప్పారావు 164వ జయంతిని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పరిశోధన కేంద్రం సంచాలకులు ఆచార్య జి.పార్వతి, పరిశోధన కేంద్రం సిబ్బంది, పాఠకులు కలసి ముందుగా గురజాడ అప్పారావు చిత్రపటానికి పూలమాల సమర్పించి నివాళులర్పించారు. ఆ తర్వాత ఆచార్య జి.పార్వతి మాట్లాడుతూ హేతువాది అయిన గురజాడ అప్పారావు తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి అని, తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఆయన ఒకరని అన్నారు. 19వ శతాబ్దంలోను, 20వ శతాబ్ది మొదటి దశకంలోనూ ఆయన చేసిన రచనలు సామాజిక దర్పణాలని, అందువల్లనే ఈనాటికీ ప్రజల మన్ననలను పొందుతున్నాయన్నారు. లవణరాజు కల, కన్యక, పుత్తడిబొమ్మ పూర్ణమ్మ అనే రచనల్లోని కవితల్ని వినిపించారు. సహాయ పరిశోధకులు డా॥ భూతపురి గోపాలకృష్ణ శాస్త్రి మాట్లాడుతూ గురజాడ రాసిన కన్యాశుల్కం నాటకానికి సాహితీ లోకంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉందన్నారు. ఈ నాటకంలో ఆయన సృష్టించిన సంభాషణలు, గిరీశం, మధురవాణి, రామప్ప పంతులు మొదలైన పాత్రలు తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాయన్నారు. మరో సహాయ పరిశోధకులు డా॥ చింతకుంట శివారెడ్డి మాట్లాడుతూ అభ్యుదయ కవితా పితామహుడుగా పేరొందిన గురజాడ ప్రజలందరికీ అర్థమయ్యే వాడుక భాషలో రచనలు చేశారన్నారు. ముత్యాల సరాలు అనే ఛందస్సును సృష్టించి, అనేక రచనలు ఆ ఛందస్సులోనే చేశారన్నారు. గ్రంథాలయ సహాయకులు జి.హరిభూషణరావు మాట్లాడుతూ గురజాడ రాసిన దేశభక్తి గేయం చాలా విశిష్టమైందన్నారు.
ఈ కార్యక్రమంలో సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం జూనియర్‌ అసిస్టెంట్లు ఆర్‌.వెంకటరమణ, ఎం.మౌనిక, సిబ్బంది, పాఠకులు డా॥ ఎస్‌.రాజగోపాల రెడ్డి పాల్గొన్నారు.

డా.పి.సరిత
సంచాలకులు, ప్రజా సంబంధాలు
యోగి వేమన విశ్వవిద్యాలయం, కడప