28.09.2025 సమసమాజ స్థాపనకై పోరాడిన ‘విశ్వకవి జాషువా’
– డా.చింతకుంట శివారెడ్డి                                                             సహాయపరిశోధకులు, సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం

‘గబ్బిలం’ లాంటి రచనలతో సమసమాజ స్థాపనకై పోరాడిన విశ్వకవి ‘గుర్రం జాషువా’ అని సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం సహాయ పరిశోధకులు డా.చింతకుంట శివారెడ్డి అన్నారు. యోగి వేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం ఆదివారం నవయుగ కవిచక్రవర్తి గుర్రం జాషువా 131వ జయంతిని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం పరిశోధన కేంద్రం సిబ్బంది, పాఠకులు కలసి ముందుగా జాషువా చిత్రపటానికి పూలమాల సమర్పించి నివాళులర్పించారు. ఆ తర్వాత చింతకుంట శివారెడ్డి మాట్లాడుతూ జాషువా సాహిత్యం పేదలు, పీడుతులు, కార్మికులు, కర్షకుల పక్షాణ నిలబడి ప్రశ్నించేలా ఉంటుందన్నారు. ‘ఇచ్చోటనే’ లాంటి పద్యాల్లో మనిషిలా సమాన్య జీవితం గడిపి మరణించకుండా తనకంటూ చరిత్రలో ఒకపుటను సంపాదించుకునేలా బతకాలన్న సందేశముందన్నారు.  ‘వనితలు పెండ్లిజేతురు’ లాంటి పద్యాల్లో ఒకవైపు డబ్బువిలువను తెలియజేస్తూనే, మరోవైపు పేదవారి ఆకలి తీర్చాలన్న సందేశాన్నిచ్చారన్నారు. దేవాలయ నిర్మాణానికి శ్రమించిన హరిజనులను తిరిగి అదే దేవుని దర్శనానికి అర్హులు కాదనడం ఎంతవరకు సరైందని ఆనాటి సమాజాన్ని జాషువా ప్రశ్నించారన్నారు. కఠిక పేదరికంలో పుట్టి శాసనమండలి సభ్యుడుగా ఎదిగిన జాషువా జీవితం నేటి యువతకు ఆదర్శమన్నారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న యో.వే.వి. పాలకమండలి సభ్యులు ఆచార్య మూల మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ సమాజాన్ని సన్మార్గంలో పయనించేలా అభ్యుదయకోణంలో రచనలుచేసి
‘నవయుగ కవిచక్రవర్తి’గా జాషువా కీర్తించబడ్డారన్నారు. వారు రాసిన క్రీస్తుచరిత్ర పుస్తకానికి కేంద్రసాహిత్య అకాడమి పురస్కారం లభించిందన్నారు. సుమారు 20కిపైగా మేలైన రచనలు చేసిన జాషువాను అభినందిస్తూ తిరుపతి వేంకట కవులలో ఒకరైన చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి వారి కాలికి గండపెండేరం తొడిగి, వారి పాదాలను తాకడం అదృష్టమని చెప్పడం విశేషమన్నారు. సహాయ పరిశోధకులు డా.భూతపురి గోపాలకృష్ణశాస్త్రి మాట్లాడుతూ 1932లో పర్షియన్‌ చక్రవర్తి ఘజనీ మొహమ్మద్‌ ఆస్థానంలో ఉన్న కవి ఫిరదౌసి జీవితంపై ఫిరదౌసి కావ్యం వెలువరించారన్నారు. రాజు చేసిన మోసానికి ఫిరదౌసి  ఆవేదనతో ఆత్మహత్య చేసుకొన్న ఆ కవి హృదయాన్ని జాషువా అద్భుతంగా వర్ణించాడన్నారు. గ్రంథాలయ సహాయకులు ఎన్‌.రమేష్‌రావు మాట్లాడుతూ జాషువా సాహిత్యంపై ఎండ్లూరి సుధాకర్‌ పరిశోధనచేసి ‘జాషువా సాహిత్యం దృక్ఫథం`పరిణామం’ పుస్తకం వెలువరించారన్నారు. జి.హరిభూషణరావు మాట్లాడుతూ జాషువా కుమార్తె హేమలతా లవణం నెలకొల్పిన జాషువా ఫౌండేషన్‌ ద్వారా భారతీయ భాషలలో మానవ విలువలతో కూడిన రచనలు చేసిన సాహిత్యకారులకు జాషువా సాహిత్య పురస్కారం అందజేయబడుతుందన్నారు. రచయిత కొత్తపల్లె రామాంజనేయులు మాట్లాడుతూ  జాషువా ప్రతిభాపాఠవాలకు నిదర్శనంగా ఆంధ్రవిశ్వవిద్యాలయం వారిని ‘కళాప్రపూర్ణ’ బిరుదుతో సత్కరించిందన్నారు.
ఈ కార్యక్రమంలో సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం జూనియర్‌ అసిస్టెంట్లు ఆర్‌.వెంకటరమణ, ఎం.మౌనిక, సిబ్బంది, పుత్తా పుల్లారెడ్డి తదితర పాఠకులు పాల్గొన్నారు.
డా.పి.సరిత
సంచాలకులు, ప్రజా సంబంధాలు
యోగి వేమన విశ్వవిద్యాలయం, కడప