31.8.2025
తన కలంజ్యోతితో సాహితీ వెలుగునందించిన ‘శుభ్రజ్యోత్స’
                  – గంగనపల్లె వెంకటరమణ
                          ప్రధానోపాధ్యాయులు (ఎఫ్‌.ఎ.సి.), నాగిరెడ్డిపల్లె ఉన్నత పాఠశాల
కవిగా, గేయకర్తగా, నాటక రచయితగా బహుముఖీన సేవలందించి తన కలంజ్యోతితో సాహితీ వెలుగునందించిన ప్రముఖ సాహితీవేత్త ‘శుభ్రజ్యోత్స’(యెద్దల గంగయ్య) అని నాగిరెడ్డిపల్లె ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు (ఎఫ్‌.ఎ.సి) గంగనపల్లె వెంకటరమణ అన్నారు. యోగి వేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం నిర్వహిస్తున్న ‘నెలనెలా సీమ సాహిత్యం’ 146వ సదస్సులో భాగంగా ‘శుభ్రజ్యోత్స(యెద్దల గంగయ్య) జీవితం ` సాహిత్యం’  కార్యక్రమం ఆదివారం బ్రౌన్‌శాస్త్రి సమావేశ మందిరంలో నిర్వహింపబడిరది.
వెంకటరమణ తన ప్రసంగంలో శుభ్రజ్యోత్స్న అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలంలోని అనంతంపల్లెకు చెందిన యద్దల రామయ్య, చెంగమ్మ గార్లకు 01.07.1941న జన్మించారని, అనంతంపల్లెలో, రాజంపేటలో విద్యాభ్యాసం పూర్తిచేసి, వృత్తిరీత్యా ఉపాధ్యాయులైన ఆయన రాజంపేటలో నివసిస్తూ వివిధ ప్రాంతాల్లో పనిచేసి పదవీ విరమణ చేశారన్నారు.
శుభ్రజ్యోత్స్న ‘శ్రీరామ కథామృతం’, ‘తెలుగుబిడ్డ’ పేరుతో రచించిన శతక పద్యాలు, ‘శ్రీ అన్నమయ్య బాటలో వేంకటేశ్వరస్వామి పాటలు’ అనేవి ముద్రిత రచనలు కాగా మొదటి రెండు రచనలు నేడు అలభ్యంగా ఉన్నాయన్నారు. ‘శ్రీకృష్ణ గానామృతం, శ్రీశివ నామామృతం (పద్యకావ్యం), శ్రీమహా కురుక్షేత్రం, గీతామృతం, ఆంధ్రవిహారం, మూగబాధ (ఖండకావ్యం), నేను ` నా యెల్లి (జానపద గేయకథాకావ్యం), వినాయకలీల (హాస్యనాటిక), అహల్యా శాపం (కథ), పాడుకో…హాయిగా (పద్యకవితా సంపుటి)’ అనే రచనలు అముద్రితాలని, వీటిలో ‘మూగబాధ (ఖండకావ్యం), నేను ` నా యెల్లి (జానపద గేయకథాకావ్యం)’ అనే రచనలు సీమప్రభ అనే పక్షపత్రికలో ధారావాహికంగా వెలువడ్డాయన్నారు. అన్నమాచార్యుల స్ఫూర్తితో ‘శ్రీ అన్నమయ్య బాటలో వేంకటేశ్వరస్వామి పాటలు’ గ్రంథంలో 55 పాటలున్నాయన్నారు. నండూరి వెంకట సుబ్బారావు ‘ఎంకిపాటలు’ ప్రేరణతో 47 గేయాలతో ‘నేను ` నా యెల్లి’ అనే జానపద గేయకథాకావ్యాన్ని రాశారన్నారు. బ్రహ్మాండ పురాణం, విచిత్ర రామాయణం ఆధారంగా ‘అహల్యా శాపం’ అనే కథను రాశారన్నారు. శివతత్వ మహిమ, కాలభైరవుడు, గంగా గౌరీ సంవాదం, తారకాసుర సంహారం మొదలైన విషయాలతో ఆటవెలది పద్యాల్లో రచించిన కావ్యం ‘శ్రీశివ నామామృతం’. హృదయాంజలి, కాంక్ష, స్వాగతం, ఆంధ్రప్రశస్తి, సంక్రాంతికి స్వాగతం లాంటి పలు పద్యకవితలతో ‘పాడుకో…హాయిగా’ అనే పద్యకవితా సంపుటిని వెలువరించారన్నారు.
కార్యక్రమాన్ని డా॥ చింతకుంట శివారెడ్డి, డా॥ భూతపురి గోపాలకృష్ణశాస్త్రి సమన్వయం చేశారు.
కార్యక్రమం అనంతరం వక్త గంగనపల్లె వెంకటరమణను సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం పరిశోధన కేంద్రం సహాయ పరిశోధకులు డా॥ చింతకుంట శివారెడ్డి, డా॥ భూతపురి గోపాలకృష్ణశాస్త్రి, గ్రంథాలయ సహాయకులు ఎన్‌.రమేశ్‌రావు, జూనియర్‌ అసిస్టెంట్లు ఆర్‌.వెంకటరమణ, ఎం.మౌనిక, సిబ్బంది, పాఠకులు కలసి శాలువతో సత్కరించారు.
 కార్యక్రమంలో శుభ్రజ్యోత్స కుమారుడు నందకిశోర్‌, రాజంపేట ప్యూచర్‌మైండ్‌ పాఠశాల అధ్యాపకులు, చెంచిరెడ్డి, పళ్ళె విజయ్‌, కుమార్‌, శ్యామసుందర్‌ రెడ్డి, రమణమూర్తి, వెంకట రమణ, విజయ కుమార్‌, సుబ్బరాయుడు, బాలరాజేశ్వర రెడ్డి, నల్లపరెడ్డి, ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.     డా.పి.సరిత
సంచాలకులు, ప్రజా సంబంధాల విభాగం
యోగి వేమన విశ్వవిద్యాలయం