‘మా తెలుగుతల్లి’కు మల్లెపూదండలల్లినవాడు ‘సుందరాచారి’
– డా.చింతకుంట శివారెడ్డి సహాయపరిశోధకులు, సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం
‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ’ గీత రచనతో చిరయశస్సును సంపాదించిన సుందరకవి శంకరంబాడి సుందరాచారి అని సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సహాయ పరిశోధకులు డా.చింతకుంట శివారెడ్డి పేర్కొన్నారు. యోగి వేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం ఆదివారం సాయంత్రం బ్రౌన్‌శాస్త్రి సమావేశ మందిరంలో ప్రసన్నకవి శంకరంబాడి సుందరాచారి 112వ జయంతిని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముందుగా పరిశోధన కేంద్రం సిబ్బంది, పాఠకులు కలసి శంకరంబాడి సుందరాచారి చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులు అర్పించారు. ఆ తర్వాత డా.చింతకుంట శివారెడ్డి మాట్లాడుతూ శంకరంబాడి సుందరాచారి పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారని, అయినప్పటికీ బ్రాహ్మణ ఆచార సంప్రదాయాల పట్ల విముఖత కలిగి స్వతంత్ర భావాలతో వ్యవహరించేవారని అన్నారు. సుందర రామాయణం, సుందర భారతం, బుద్ధగీతి, సుందర సుధాబిందువులు వంటి పుస్తకాలు ఆయనకు మంచిపేరు తెచ్చాయని అన్నారు. శంకరంబాడి సుందరాచారి జీవితసాహిత్యాలను పరిచయం చేస్తూ డా.జానమద్ది హనుమచ్ఛాస్త్రి ‘ప్రసన్నకవి శంకరంబాడి సుందరాచారి’ అనే గ్రంథాన్ని రచించారని అన్నారు. 1975లో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంలో రవీంద్రభారతిలో టంగుటూరి సూర్యకుమారి ‘మా తెలుగుతల్లి’ గీతం గానం చేస్తుండగా, గీతరచయిత శంకరంబాడి గురించి మండలి వెంకట కృష్ణారావు వంటి మంత్రుల మధ్య చర్చ వచ్చిందని, అక్కడే అనామకంగా సభలో ఉన్న శంకరంబాడిని గుర్తించి ఆయనను సత్కరించారని, రూ.250/` శాశ్వత గౌరవ వేతనాన్ని ప్రకటించారని అన్నారు. ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ గీతాన్ని ఆలపించి గీత రచన విశిష్టతను కొనియాడారు. సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం గ్రంథపాలకులు ఎన్.రమేశ్‌రావు మాట్లాడుతూ ఆయన ఉద్యోగం కోసం ఆంధ్రపత్రిక వ్యవస్థాపకులు దేశోద్ధారక నాగేశ్వరరావును కలిసినప్పుడు ఆయన ‘నీకు తెలుగు వచ్చా?’ అన్నప్పుడు, ‘మీకు తెలుగు రాదా?’ అని ఎదురు ప్రశ్న వేసిన ధైర్యశాలి అని అన్నారు. ఆ తర్వాత ఆంధ్రపత్రికలో అచ్చుతప్పులు దిద్దే ఉద్యోగం చేశారని, అక్కడ కూడా ఆయన భావాలకు విరుద్ధంగా పనిచేయాల్సి రావడంతో ఆ ఉద్యోగాన్ని వదిలేశారని అన్నారు. శంకరంబాడి సుందరాచారి ఉపాధ్యాయులుగా, ఉపాధ్యాయ పర్యవేక్షకులుగా కూడా పనిచేశారని అన్నారు. యోగి వేమన విశ్వవిద్యాలయం జర్నలిజంశాఖ అకడమిక్ కన్సల్టెంట్ డా.తుమ్మలూరు సురేష్‌బాబు మాట్లాడుతూ శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆయనను ‘ప్రసన్నకవి’ బిరుదంతో సత్కరించిందని అన్నారు. ‘శంకరంబాడి సుందరాచారి నేను’ అనే పేరు తేటగీతిలో చక్కగా ఇమడడం వల్ల, ఆయనకు తేటగీతిపై మక్కువ ఏర్పడి రచనలన్నింటినీ తేటగీతి ఛందస్సులోనే చేశారని అన్నారు. మహాత్మాగాంధీ మరణించిన సందర్భంలో ‘బలిదానం’ అనే కావ్యం రాశారని, ఏకలవ్యుని వృత్తాంతంతో ‘ఏకలవ్య’ అనే ఖండకావ్యం, జానపదశైలిలో అనేక గీతాలు రాశారని అన్నారు.
ఈ కార్యక్రమంలో సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సిబ్బంది, సూర్య చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు ఎం.ప్రభాకర్, పాఠకులు జయప్రసాద్, రంగ, చరణ్ కుమార్, చంద్రశేఖరరెడ్డి, వెంకటరమణ, పేట మహేంద్ర తదితరులు పాల్గొన్నారు.
డా.పి.సరిత
సంచాలకులు, ప్రజా సంబంధాలు
యోగి వేమన విశ్వవిద్యాలయం, కడప