7.10.2025
రసరమ్యమైన రామాయణాన్ని అందించిన ఆదికవి ‘వాల్మీకి’
– డా.చింతకుంట శివారెడ్డి సహాయపరిశోధకులు,సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం
నవరసాలతో కూడిన రసరమ్యమైన రామాయణాన్ని అందించిన ఆదికవి వాల్మీకి మహర్షి అని సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సహాయ పరిశోధకులు డా.చింతకుంట శివారెడ్డి పేర్కొన్నారు. యోగి వేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం మంగళవారం బ్రౌన్‌శాస్త్రి సమావేశ మందిరంలో వాల్మీకి మహర్షి జయంతిని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముందుగా పరిశోధన కేంద్రం సిబ్బంది, పాఠకులు కలసి వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాల సమర్పించి నివాళులర్పించారు. ఆ తర్వాత డా.చింతకుంట శివారెడ్డి మాట్లాడుతూ రత్నాకరుడనే దారిదొంగగా ఉంటూ జీవనం చేస్తూ మహర్షిగా ఎదిగిన వాల్మీకి జీవితం నేటి యువతకు ఆదర్శమన్నారు. రామ నామ జపశక్తితో విద్యావంతుడుగా మారిన వాల్మీకి రామాయణాన్ని అందించి ఆదికవిగా కీర్తిగడిరచారన్నారు. క్రౌంచ పక్షుల వియోగాన్ని చూసిన వాల్మీకి శోకం నుండి శ్లోకం పుట్టిందన్నారు. రామాయణంలోని రాముని పాత్ర పితృవాక్యపరిపాలనాదక్షతను, ఏకపత్నీవ్రత లక్షణాలను, సీత పాత్ర బాధల్లో భర్తకు తోడుగా భార్య నడవాలన్న సందేశాన్ని, ఆంజనేయుని పాత్ర గురుభక్తిని, దైవభక్తిని, లక్ష్మణుని పాత్ర అన్నదమ్ముల అనుబంధాన్ని తెలియజేస్తాయన్నారు. రామాయణంలో అన్ని పాత్రలను ఆదర్శవంతంగా తీర్చిదిద్ది అద్భుతమైన ఇతిహాసాన్ని అందించిన ఘనత వాల్మీకికే దక్కిందన్నారు. గ్రంథాలయ సహాయకులు ఎన్.రమేశ్‌రావు మాట్లాడుతూ ఒక కిరాతకుడుగా ఉండి తనను తాను తీర్చిదిద్దుకొని మహర్షిగా మారి 24 వేల శ్లోకాలతో రామాయణాన్ని రచించిన వాల్మీకి తరువాత వచ్చిన ఎంతోమంది కవులకు ఆదర్శమన్నారు. వాల్మీకి రామాయణ కథను అనుసరించి తరువాత అనేక రామాయణాలు పుట్టుకొచ్చాయన్నారు.
ఈ కార్యక్రమంలో సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం జూనియర్ అసిస్టెంట్లు ఆర్.వెంకటరమణ, ఎం.మౌనిక, సిబ్బంది, మల్లేష్, శ్రీను, ప్రశాంత్ సాగర్, చంద్ర, మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.
డా.పి.సరిత
సంచాలకులు, ప్రజా సంబంధాలు
యోగి వేమన విశ్వవిద్యాలయం, కడప