10.9.2025
కల్పవృక్షంలాంటి రామాయణాన్ని అందించి
జ్ఞానపీఠాన్ని అధిరోహించిన కవిసామ్రాట్ ‘విశ్వనాథ’
– డా.చింతకుంట శివారెడ్డి సహాయపరిశోధకులు,సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం
రామాయణ కల్పవృక్షం వంటి గొప్ప కావ్యాన్ని అందించి సాహిత్యరంగంలో అత్యుత్తమ పురస్కారమైన జ్ఞానపీఠ పురస్కారాన్ని అందుకున్న కవిసామ్రాట్ ‘విశ్వనాథ సత్యనారాయణ’ అని సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సహాయ పరిశోధకులు డా.చింతకుంట శివారెడ్డి పేర్కొన్నారు. యోగి వేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం బుధవారం బ్రౌన్‌శాస్త్రి సమావేశ మందిరంలో విశ్వనాథ సత్యనారాయణ 130వ జయంతిని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముందుగా పరిశోధన కేంద్రం సిబ్బంది, పాఠకులు కలసి విశ్వనాథ చిత్రపటానికి పూలమాల సమర్పించి నివాళులర్పించారు. ఆ తర్వాత డా.చింతకుంట శివారెడ్డి మాట్లాడుతూ సాహిత్యవిభాగంలో అత్యుత్తమ పురస్కారమైన జ్ఞానపీఠ అవార్డును మొదటిసారి అందుకొని తరువాత వాళ్లకు మార్గదర్శకుడయ్యారన్నారు. పేదరికంలో పుట్టి, చెళ్లపిల్ల వెంకటశాస్త్రి దగ్గర శిష్యరికం చేసి కష్టపడి చదువుకుని జ్ఞానాన్ని సంపాదించారన్నారు. పద్యం, విమర్శ, నాటకం, కథ, కవిత లాంటి పలు ప్రక్రియల్లో సుమారు 50కి పైగా రచనలు చేసిన గొప్పకవి విశ్వనాథ అని అన్నారు. కాలేజి చదువుతున్న రోజుల్లో 1921లో గాంధీ పిలుపు మేరకు సహాయ నిరాకణోద్యమంలో పాల్గొనేందుకు తన చదువును సైతం తృణప్రాయంగా వదులుకున్న గొప్ప దేశభక్తుడు విశ్వనాథ అని అన్నారు. జ్ఞానపీఠ పురస్కారంతోపాటు పద్మభూషణ్, కళాప్రపూర్ణ, పలు గౌరవడాక్టరేట్లు లాంటి అనేక పురస్కారాలు పొందారన్నారు. అందరూ చెప్పిన రామాయణాన్నే మళ్లీ నువ్వు కొత్తగా చెప్పేదేముంది అని అపహాస్యం చేసినా, తనదైన శైలిలో రామాయణ కల్పవృక్షం రాసి తెలుగు సాహిత్యానికి వన్నెతెచ్చారన్నారు. గ్రంథాలయ సహాయకులు ఎన్.రమేశ్‌రావు మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాట కాలంనాటి దేశ స్థితిగతులను తెలుపుతూ ‘వేయి పడగలు’ గ్రంథాన్ని రాశారని, ఆ పుస్తకాన్ని పి.వి.నరసింహారావు ‘సహస్రఫణ్’ పేరుతో హిందీలోకి అనువదించగా, డా.వెల్చాల కొండలరావు ప్రేరణతో చేపూరి సుబ్బారావు బృందం ‘థౌజెండ్ హుడ్స్’ పేరుతో ఆంగ్లంలోకి అనువదించారన్నారు. మరో గ్రంథాలయ సహాయకులు జి.హరిభూషణరావు మాట్లాడుతూ వాల్మీకి సంస్కృత రామాయణాన్ని ‘రామాయణ కల్పవృక్షం’ పేరుతో మూలాన్ని భంగపరచకుండా, ఎన్నో జాగ్రత్తలు తీసుకొని పాఠకులకు అందించిన విశ్వనాథ సాహితీలోకంలో చిరస్మరణీయులయ్యారన్నారు.
ఈ కార్యక్రమంలో సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం జూనియర్ అసిస్టెంట్లు ఆర్.వెంకటరమణ, ఎం.మౌనిక, సిబ్బంది, దక్షిణామూర్తి, సాయి బాలాజి, ఎం.పద్మావతి, భాస్కర్, శ్రీహరి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.